ఇది భారత్ కు కూడా ప్రమాదకరమే: శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధనౌకను అమెరికా ముంచివేయడంపై శ్రీలంక ఎంపీ స్పందన

  • శ్రీలంక తీరం సమీపంలో ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా జలాంతర్గామి దాడి
  • దక్షిణాసియా ప్రాంతానికి పెను ముప్పు అన్న నామల్ రాజపక్స
  • ఈ ఆపరేషన్ గురించి శ్రీలంక ప్రభుత్వానికి ముందే తెలుసా? అని ప్రశ్న
  • ఇది శ్రీలంక సార్వభౌమత్వానికి సంబంధించిన అంశమని వ్యాఖ్య
  • ఈ అంశాన్ని భారత్ సీరియస్ గా తీసుకుంటుందనే నమ్మకం ఉందన్న ఎంపీ

అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య నడుస్తున్న యుద్ధం ఇప్పుడు హిందూ మహాసముద్రానికి పాకింది. నిన్న శ్రీలంక తీరానికి సమీపంలో అమెరికాకు చెందిన ఒక జలాంతర్గామి... ఇరాన్ యుద్ధనౌకను ముంచివేయడం అంతర్జాతీయంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై శ్రీలంక ఎంపీ నామల్ రాజపక్స (శ్రీలంక మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స కుమారుడు) స్పందిస్తూ, ఇది కేవలం శ్రీలంకకే కాకుండా భారత్ సహా మొత్తం దక్షిణాసియా ప్రాంత భద్రతకు పెను ముప్పు అని హెచ్చరించారు.


ఈ ఆపరేషన్ గురించి శ్రీలంక ప్రభుత్వానికి ముందే తెలుసా? అని నామల్ రాజపక్స నిలదీశారు. ఒకవేళ తెలిస్తే ప్రజలకు ఎందుకు వెల్లడించలేదని, తెలియకుండానే మన జలాల్లో ఇంత పెద్ద దాడి ఎలా జరిగిందని ఆయన ప్రశ్నించారు. ఇది శ్రీలంక సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని ఆయన పేర్కొన్నారు.


గతంలో లిబియా, ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్ యుద్ధాల తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసని, ఇప్పుడు హిందూ మహాసముద్రంలో ఇలాంటి దాడులు జరగడం వల్ల భారత్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల జాతీయ భద్రతపై ప్రభావం పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత్ వంటి ప్రాంతీయ భాగస్వాములతో కలిసి శ్రీలంక చర్చలు జరపాలని ఆయన సూచించారు. ఈ అంశాన్ని భారత్ సీరియస్ గా తీసుకుంటుందనే నమ్మకం తనకు ఉందని అన్నారు.


ఈ క్షిపణి దాడికి సంబంధించిన వివరాల్లోకి వెళితే... పర్షియన్ గల్ఫ్ ప్రాంతానికి దూరంగా, శ్రీలంక దక్షిణ తీరానికి కేవలం 40 నాటికల్ మైళ్ల దూరంలో అంతర్జాతీయ జలాల్లో దాడి జరిగింది. అమెరికా సబ్ మెరైన్ దాడిలో ఇరాన్ యుద్ధనౌక సముద్రంలో మునిగిపోయింది.


ఈ నౌకలో ఉన్న వారిలో 32 మంది ఇరాన్ నావికులను శ్రీలంక నావికాదళం రక్షించింది. అయితే, మరో 148 మంది సిబ్బంది గల్లంతయ్యారని శ్రీలంక నేవీ అధికారులు చెబుతున్నారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నప్పటికీ, వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు తక్కువని అధికారులు భావిస్తున్నారు.


Namal Rajapaksa
Sri Lanka
Iran warship
US submarine
Indian Ocean
South Asia security
India
Sri Lanka Navy
Iran Navy
geopolitics

More Telugu News